Revanth Reddy: కసబ్ లాంటి వాడిని ఉరితీసేందుకే సమయం పట్టింది... కేసీఆర్‌కు వెసులుబాటు ఉండదా?: రేవంత్ రెడ్డి

  • మీడియా ఇంత అరాచకంగా తనను ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ ఇచ్చామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్య
  • ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ సాగుతోందన్న ముఖ్యమంత్రి
  • హరీశ్ రావు రాజీనామా పత్రాన్ని ఫార్మాట్లో తీసుకురాలేదన్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy compares KCR cases with kasab issue

మన రాజ్యాంగంలో కసబ్‌లాంటి వాడికే ప్రొవిజన్ ఉందని... అలాంటిది కేసీఆర్‌కు వెసులుబాటు ఉండదా? అందుకే వివిధ కేసుల్లో విచారణకు సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీవీ 'క్వశ్చన్ అవర్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మేడిగడ్డపై, విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడీషియల్ విచారణ వేశామన్నారు.

'ఈరోజు ఏ ప్రాసెస్ అయినా... రేపు భవిష్యత్తులో ఆ విచారణలో ఇబ్బందులు ఉండకుండా విచారణ జరుగుతుంది. ప్రతి విచారణను నేనే ఫిర్యాదు చేసి... నేనే విచారణ చేసి... నేనే జడ్జిమెంట్ రాసి... నేనే శిక్ష వేసే విధానం ఇక్కడ ఉండదు. మన దేశంలో కసబ్‌ను కూడా ఉరితీసేందుకు ఎంత సమయం పట్టిందో తెలుసు. కసబ్ లాంటి వాడికే రాజ్యాంగంలో ఓ ప్రొవిజన్ ఉంది. తన వాదనలు వినిపించుకోవడానికి... విచారణ చేయడానికి... ఆధారాలు నిర్ధారించడానికి.. కసబ్‌కు వెసులుబాటు ఉంది. కసబ్‌కే ఉన్నప్పుడు కేసీఆర్‌కు వెసులుబాటు ఉండదా?' అన్నారు.

మీడియా ఇంత అరాచకంగా ప్రశ్నలు అడిగినా బాధ్యతాయుతంగా సమాధానం చెబుతున్నా!

ఐదు నెలల పాలనలో మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు మాత్రమే కాదని... చాలా చేశామని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద రూ.7500 కోట్లు, నిరుద్యోగులకు 30వేల ఉద్యోగాలు ఇచ్చామని, కులగణనకు ఆదేశాలు ఇచ్చాం, డ్రగ్స్ మహమ్మారిని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామన్నారు. ఇంకా, ఈరోజు ఈ రాష్ట్రంలో మీడియా వాళ్లు ఓ ముఖ్యమంత్రి వద్ద కూర్చొని స్వేచ్ఛగా... ఇష్టారాజ్యంగా... అరాచకంగా ప్రశ్నలు అడిగినా బాధ్యతాయుతంగా సమాధానం చెప్పే పరిస్థితి వచ్చిందని చెబుతామన్నారు. ఇదివరకు ఎప్పుడైనా సీఎంను ఇలా ప్రశ్నలు అడిగారా? అని ప్రశ్నించారు. తాము జవాబుదారీతనాన్ని తీసుకువచ్చామన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాఫ్తు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారులు నివేదిక ఇచ్చాక చర్యలు ఉంటాయన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో పలువురు అధికారులు జైలుకు వెళ్లినట్లు చెప్పారు. అధికారులు అందర్నీ పిలిచి విచారిస్తున్నారని... విచారణ క్రమపద్ధతిలో జరుగుతోందన్నారు. విచారణ పూర్తి కావాలని... నివేదిక ఇవ్వాలని... ఇలా క్రమపద్ధతిలో ముందుకు సాగుతోందన్నారు. ఓవర్ నైట్ తాను ఏదైనా చేస్తే మళ్లీ మీరే రాజకీయ కక్ష అంటారన్నారు. నివేదిక వచ్చాక ప్రజలకు అన్నీ చెబుతానన్నారు. ఈ కేసులో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు.

తాను దేవుడిని నమ్ముతానని... అందుకే తాను దేవుళ్లపై ఒట్టు వేసి పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నానని అన్నారు. హరీశ్ రావు తన రాజీనామా పత్రాన్ని సరైన ఫార్మాట్‌లో ఇవ్వలేదన్నారు. ఈటల రాజేందర్ ఎప్పుడైనా కేసీఆర్ అవినీతిపై మాట్లాడారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News